Wednesday, July 31, 2013

తెలంగాణ సీఎం డీఎస్... ఏపీ ముఖ్యమంత్రి చిరంజీవి... 2014 పోల్‌కు రెడీ?

180 రోజుల్లో 2 రాష్ట్రాలు... తెలంగాణ సీఎం డీఎస్.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిరంజీవి. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరిగిపోతోంది. ఆగస్టు 8న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. కేంద్ర హోంశాఖ అంచనా ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటుకు కనీసం 215 రోజులు అవసరమవుతాయి. కానీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కేవలం 180 రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటుందో అర్థమవుతుంది.

ఇకపోతే 180 రోజులు.. అంటే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు నియమించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి నియామకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో డి. శ్రీనివాస్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి లేదా చిరంజీవిని నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలంటే 119 అసెంబ్లీ స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 60 ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరో 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంటుంది. తెరాస అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో విలీనమయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

ఇక సీమాంధ్ర విషయానికి వస్తే... ఇక్కడ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 88 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఐతే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 97 సభ్యుల బలం ఉంది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా లేదు. కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచి 2014 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని ప్రచారం జరుగుతోంది. చూడాలి... కాంగ్రెస్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో...?