Wednesday, July 31, 2013

దారిలో తెలంగాణ... ట్రాకెక్కుతున్న గూర్ఖాలాండ్, మాయ యూపీ డిమాండ్

56 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేశామని కాంగ్రెస్ పార్టీ గొప్పగానే చెప్పుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పట్టాలెక్కించి యమస్పీడుగా పరుగులు తీయిస్తోంది. సీమాంధ్ర ప్రాంత వాసులు నదీ జలాలు, రాష్ట్ర రాజధాని విషయం ఏంటని అడుగుతున్నప్పటికీ, ఆ విషయంపై స్పష్టత ఇవ్వకనే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా పిలుపు కూడా పంపింది.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆవిర్భావం జోష్‌లో ఉండగా సీమాంధ్ర అగ్గిమీద గుగ్గిలంగా మారింది. వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్పష్టమైన ప్రకటనతో, ఇరు ప్రాంతాల మధ్య సమన్వయం సాధించకుండానే నిర్ణయాన్ని ప్రకటించేసింది కాంగ్రెస్. ఫలితంగా రగులుతోంది సీమాంధ్ర.

నిన్న రాత్రి తెలంగాణ ప్రకటన అలా వచ్చిందో లేదో తాజాగా గూర్ఖాలాండ్, మాయావతి చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేయాలన్న డిమాండ్, విదర్భ డిమాండ్ల కందిరీగలు కాంగ్రెస్ చెవుల్లో ఇపుడిపుడే గింగురులు పుట్టిస్తున్నాయి. తెలంగాణ సాధన స్ఫూర్తిగా తీసుకున్న గూర్ఖాలాండ్ డిమాండ్ చేస్తున్న ఉద్యమకారుల్లో ఒకరు బుధవారం ఆత్మహత్య యత్నం కూడా చేశారు. దీంతో అక్కడ యూపీఎలో మంత్రిగా కొనసాగుతున్న కేంద్రమంత్రి వెంటనే రాజీనామా చేశారు. ఉద్యమకారులతో కలసి రాష్ట్ర సాధనకు పోరాటం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఇక ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి మాయావతి వ్యవహారం. తెలంగాణ ఏర్పాటును స్వాగతించిన మాయావతి, అదే చేత్తో యూపీని నాలుగు ముక్కలుగా చేసి పారేయమని డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని కోరుతున్నారు. ఇక మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతాన్ని విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండు కూడా వస్తోంది. ఇలా మొత్తమ్మీద దేశంలో కొత్త రాష్ట్రాల కోసం ఒక్కొక్క డిమాండ్ క్యూ కడుతోంది. వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఎలా చక్కబెడుతుందో చూడాలి.