Wednesday, September 11, 2013

జగనే మాయా.. బెయిల్ డీల్ నిజమేనా..?

బెయిల్‌ కోసం డీలంటూ జగన్‌మోహన్ రెడ్డి మీద గురువారం రెండు పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి. మంగళవారం జగన్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, ఆ మరుసటి రోజు బెయిల్ కోసం కోర్టుకు జగన్ చేసుకున్న దరఖాస్తు.. ఆపై సీబీఐ డీఐజీ వెంకటేశ్‌ బదిలీ వార్తల్ని ఒక్కసారిగా జగన్‌ని తిరిగి వార్తల్లోకెక్కించాయి. దీంతోపాటు సీమాంధ్రలో యాత్ర చేస్తున్న షర్మిల ‘తన అన్న బయటకు వస్తాడని’ పదేపదే చేస్తున్న ప్రకటనలు... కాంగ్రెస్‌తో జగన్ పార్టీ లాలూచీపడినట్లు ఈ పత్రికలు వ్యాఖ్యానించాయి. వీటి మాటలెలావున్నప్పటికీ సీనియర్ కాంగ్రెస్ నాయకులే ఈ వ్యవహారం పట్ల అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే దిశగా ఈ పరిణామాలు దాపురించాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణా నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం పాల్పడిన ఘోరమైన తప్పిదానికి తోడు జగన్ విషయంలో అవలంబించబోతున్న వైఖరి మూలంగా కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమంటూ ఈ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు జగన్‌కు బెయిలొస్తుందంటూ షర్మిల అంతగట్టిగా ఎలా చెప్పగలుగుతోందని ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ తన బెయిల్ పిటీషన్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక ప్రధాన రాజకీయ పక్షనేతగా తాను ప్రజల్లో వుండవలసిన అవసరాన్ని గుర్తించాలంటూ అభ్యర్థించారు. ఇది గమనించదగిన విషయం.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే ఈ బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేసినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంచేశారు.  సీబీఐ తన ఛార్జిషీట్లు దాఖలు చేయడానికి ఇచ్చిన తుదిగడువు ముగిసిపోవడంతో తమ నాయకుడు బెయిల్ పిటీషన్‌ను ఇచ్చారే తప్ప... అందుకు మరే ఇతర కారణాలతో కానేకాదని చెప్పుకొచ్చారు. సీబీఐ జగన్ అక్రమాస్తుల చివరి చార్జిషీట్‌ను కలుపుకుంటే మొత్తం అభియోగాల పత్రాల సంఖ్య 9 కి చేరుకుంది. ఇక  ఈ చివరి చార్జిషీట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించిన తర్వాత డీఐజీ వెంకటేశ్ తన సొంతరాష్ర్టమైన కేరళకు వెళ్లిపోతారని తెలుస్తోంది.

మొత్తంమీద జగన్ 15 నెలలుగా గడిపిన జైలు జీవితం ముగియబోతోందా..? జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అభియోగాల నుంచి తప్పించుకున్న సబిత ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల విషయంలో సీబీఐ ఉదాసీన వైఖరిని అవలంబించిందా..? కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జగన్ విషయంలో మెతకవైఖరి అవలంబించిందా..? ఇటీవలకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తన దర్యాప్తు వేగాన్ని తగ్గించిందా..? రేపటి రోజున కోర్టులో బెయిల్ కోసం జరిగే వాదనల్లో సీబీఐ లాయర్లు జగన్‌కు అనుకూలమైన వైఖరితో వ్యవహరిస్తారా..? లేకా టూజీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళికి బెయిల్ ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరాలులేవంటూ ఈ విధంగా పక్కకు తప్పుకుంటారా..? ఇవి తాజాగా రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో నలుగుతున్న ప్రశ్నలు.