మీరు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారా..? ఇళ్ళ నుంచి రోడ్లపైకి వస్తున్నారా? అయితే ఇంట్లో ఓ మాట చెప్పి బయటకు రండి.. ఎందుకంటే మీరు క్షేమంగా తిరిగి వెళ్తారన్న మినిమమ్ గ్యారెంటీ మన మెట్రో రోడ్లపైకి వస్తే ఉండదు.
ఇదీ.......అక్షరాల లక్షన్నర కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో రోడ్ల దుస్థితి. దేశంలోనే ఐదో మెట్రోపాలిటిన్ నగరం హైదరాబాద్. ఈ పేరు తప్ప ఆస్థాయిలో మౌళిక వసతులు మెరుగుపడలేదు. విస్తీర్ణంలో సింగపూర్ దేశం కంటే పెద్దదైన భాగ్యనగరం.., రోడ్ల నిర్వహణలో మాత్రం ఆఫ్రికా దేశాలకన్నా అధ్వాన్నంగా ఉంటోంది.
625 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉన్న హైద్రాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం రోడ్ల పొడవు 6 వేల 411 కిలోమీటర్లు. వీటిలో సీసీరోడ్లు 2వేల80 కిలోమీటర్లు కాగా, బీటీ రోడ్ల పొడవు 2 వేల 280 కిలోమీటర్లు.
మిగతా 2 వేల 051 కిలోమీటర్లు ఆ అండ్ బీ, నేషనల్ హైవేస్ పరిధిలో ఉన్నాయి. నాలుగువేల కోట్ల వార్షిక ప్రణాళిక ఉన్న నగరపాలక సంస్థ- సిటీలో ఏటా రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం దాదాపు 2వందల కోట్లు ఖర్చు చేస్తోంది. అయినా వాహనదారులకు గతుకులు, అతుకుల వెతలు తప్పటం లేదు.
ఎండా కాలంలో ఎంతో అనుకూలంగా ఉండే భాగ్యనగరి రోడ్లు చినుకుపడిందంటే., చాలు చికాకు తెపిస్తాయి. సిటీ రోడ్లపై పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే., నాసిరకంగా జరుగుతోన్న నిర్మాణాలే కారణం అన్నది అక్షర సత్యం. అందుకే రోడ్డుపైకి వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలనుకుంటూ రండి.