తెలంగాణ అంశాన్ని అటో ఇటో తేల్చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముమ్మరంగానే కసరత్తు చేస్తోంది. వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల లోపు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న ఏకైక లక్ష్యంతో ఆ పార్టీ హైకమాండ్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, నాయకులతోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ, ఇతర విద్యార్థి సంఘాల నేతలను ఢిల్లీకి రప్పించి మంతనాలు నిర్వహించింది. ముఖ్యంగా టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో కీలక చర్చ జరుపడమే కాకుండా, మున్ముందు కూడా జరుపనున్నట్టు తెలుస్తోంది.
దీనికి కారణాలు లేకపోలేదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని భావిస్తే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్టు అనేక ఆంగ్ల పత్రిక కథనాలు తేటతెల్లం చేస్తున్నాయి. అదేసమయంలో తెలంగాణలో తమ బలం.. బలగం పెంచుకోవడంతో పాటు... టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను డమ్మీ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహ రచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇందులోభాగంగా తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి.. తెలంగాణ ఉద్యమానికి ఒక రూపురేఖలు కల్పించిన టీజేఏసీ కన్వీనర్ కోదండరాంను కేసీఆర్‌కు పోటీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం అవసరమైతే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పదవిని సైతం ఆయనకు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కేసీఆర్, ఆయన కుటుంబాన్ని పూర్తిగా దూరంగా ఉంచవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే తెలంగాణలో గట్టి పట్టు ఉండాలంటే కోదండరాం వంటి ఉద్యమ నేతల చేతుల్లోనే ప్రత్యేక రాష్ట్ర భవిష్యత్తును పెడితే బావుంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయట. మరోవైపు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, తమను కాదని తెరాసలోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేతలకు షాక్ ఇవ్వడమే కాకుండా తెరాస కేసీఆర్‌తోపాటు జగన్ మోహన్ రెడ్డికి కూడా దీని ద్వారా షాక్ ఇవ్వచ్చన్న దిశలో కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి... ఏం జరుగుతుందో...?!!