భారత ఆటోమొబైల్ రంగంలోకి అనేక అత్యాధునిక కార్లు వచ్చినప్పటికీ కార్ల మార్కెట్లో మాత్రం ఇప్పటికీ రారాజుగా వెలుగొందుతున్న కారు అంబాసిడరే. మారుతీ, హ్యుండాయ్, టయోటా, హోండా, నిస్సాన్... ఇలా ఎన్ని కార్ల కంపెనీలు మార్కెట్లోకి వచ్చినా దేశీయ కారు అంబాసిడర్తో ఏమాత్రం పోటీ పడలేక పోయాయి.
1970, 1980 దశకాల్లో భారతీయ కార్ల రంగానికి ఏకఛత్రాధిపత్యం వహించిన అంబాసిడర్ కారు ఇప్పటికీ ప్రపంచంలో ఉత్తమ ట్యాక్సీగా 'టాప్ గేర్' ఓటింగ్లో నిలిచింది. బీబీసీ ఛానల్లో వచ్చే టాప్ గేర్ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిచర్డ్ హ్యామండ్ ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించారు.
ఇందులో అన్ని ఆధునిక కార్ల నుంచి ఎదురైన పోటీని భారతీయ అంబాసిడర్ విజేతగా నిలిచింది. మోరిన్ ఆక్స్ఫర్డ్గా బ్రిటన్లో ప్రారంభమై హిందూస్థాన్ అంబాసిడర్గా పేరు మార్చుకున్న ఈ కారు, 80వ దశకం సగంలో మారుతీ కారు రంగ ప్రవేశం వరకు రారాజుగా వెలుగొందింది. ఈ కార్లను పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీలో సీకే బిర్లా గ్రూపునకు చెందిన హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది.