Sunday, July 21, 2013

'కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదంటే ఇవ్వదు': కవిత ఫైర్

పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొత్సను ఓ మాయల మరాఠీగా అభివర్ణించారు. రాష్ట్ర విభజనపై బొత్స సత్యనారాయణ మాట మార్చడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ.. తెలంగాణపై గత రెండు నెలలుగా కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని కవిత విమర్శించారు. తెలంగాణపై వ్యతిరేకంగా సీఎం కిరణ్ రోజుకో లీకు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోజుకోమాట మాట్లాడుతున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు కాంగ్రెస్‌ పార్టీని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎవరూ నమ్మబోరన్నారు. సీఎం, బొత్సకు వ్యతిరేకంగా తెలంగాణ మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు మేల్కోవాలని ఆమె పిలుపునిచ్చారు.