హైదరాబాద్‌లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే మంగళవారం తెల్లవారుజామున పురాతన గోడ ఒకటి కూలి గుడిసెలపై పడటంతో అందులో నిద్రిస్తున్న 8 మందిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆ ఇద్దరు కూడా చిన్న పిల్లలు కావడం గమనార్హం. ఈ సంఘటన మౌలాలీ ఎంజే కాలనీలో చోటు చేసుకుంది.
ఈ కాలనీలోని భారీ పురాతన గోడ... పక్కనున్న రెండు పూరి గుడిసెలపై కుప్పకూలింది. దీంతో గుడిసెల్లో గాఢనిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈ మృతులంతా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన వలస కూలీలుగా భావిస్తున్నారు.
మృతులను గుర్తించాల్సి ఉంది. అయితే, ఈ ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులను మాత్రం సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. జేసీబీ యంత్రాల సాయంతో శిథిలాలు తొలగించారు. మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మౌలాలీ ఎంజే కాలనీలో గోడ కూలిన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.