రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి కారణంగా వచ్చిన వరదల వల్ల ఇప్పటి వరకు 12 మంది చనిపోయినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్. రఘువీరా రెడ్డి తెలిపారు. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి రఘువీరా, ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం మంత్రి రఘువీరా మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోందన్నారు. వర్షాల వల్ల మృతి చెందిన కుటుంబాలకు లక్షన్నర ఎక్స్‌గ్రేషియా, ఆపద్భందు పథకం కింద రూ.50 వేలు చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలను అందజేయనున్నట్టు తెలిపారు.
ఈ భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటి వరకు 294 చెరువులు దెబ్బతిన్నాయన్నారు. వరద ముంపునకు గురైన 884 గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసి 53 పునరావాస కేంద్రాల్లో 8,360 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందజేస్తామని మంత్రి రఘువీరా వెల్లడించారు.