పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం తొలి దశలో మొత్తం 5790 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ముగిసింది. మరో 13 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సకాలంలో ఎన్నికల సమాగ్రి చేరుకోలేక పోవడంతో పోలింగ్‌ను వాయిదా వేశారు. కాగా, తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 22 జిల్లాల్లో 26 రెవెన్యూ డివిజన్లలో 5,803 గ్రామాల్లో నిర్వహించాల్సి ఉండగా, 13 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిలిపి వేశారు.
మరోవైపు.. పోలింగ్ ముగిసిన చోట్ల సుమారుగా 80 నుంచి 95 శాతం మేరకు పోలింగ్ నమోదైనట్టు ప్రాథమిక సమాచారం. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. పోలింగ్ సమయంలో ముగిసినప్పటికీ.. చాలా కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు.
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టారు. ముందు వార్డు సభ్యులకు పోలైన ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత సర్పంచ్ లకు పోలైన ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటలలోపల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.