Wednesday, July 17, 2013

పెళ్లికి ముందు వెంట్రుక పరీక్ష : భాగస్వామి అసలు రంగు బయటపెట్టేస్తుంది!

పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే పెద్దలు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేయాలంటారు. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వరుడు గుణగణాలు, మంచిచెడ్డలు తెలుసుకొని పెళ్లి చేస్తుంటారు. మరి అబ్బాయిలయితే గుణవతి, శీలవతిలా ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

అంతా సాఫీగా జరిగితే ఫర్వాలేదు. కానీ కొందరు పెళ్లి కాకముందు ఒకలాగ, పెళ్లైన తర్వాత ఒకలాగ ప్రవర్తిస్తుంటారు. అందుకే పెళ్లి కాకముందే జీవిత భాగస్వామి నైజాన్ని ముందుగానే పసిగట్టే డీఎన్‌ఏ పరీక్షను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని చాలా చౌకలో ఇంటివద్దే చేసుకోవచ్చు.
 ఈ పరీక్షకు కావాల్సిందల్లా కాబోయే భాగస్వామి వెంట్రుక పోగు మాత్రమే. యూఎస్‌బీ లాంటి పరికరం ఉంటుంది. దీన్ని లాప్‌టాప్‌కు అమర్చుకోవచ్చు. ఈ పరీక్ష కోసం నానోపోర్ డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ అనే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇది నిబద్ధతకు సంబంధించిన వాసోప్రెసిన్ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్లను నియంత్రించే జన్యువులను పరిశీలించడం ద్వారా పనిచేస్తుంది.

దీనిద్వారా పరీక్ష చేసిన వారు వైవాహిక బంధానికి దీర్ఘకాలం కట్టుబడి ఉంటారా? లేక మోసానికి పాల్పడతారా? వంటి అనేక విషయాలు వెల్లడవుతాయి. భవిష్యత్‌లో ఈ పరికరం సూపర్ మార్కెట్‌లోనూ అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు తెలిపారు.