రాష్ట్ర రాజకీయ యవనికపై అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్న వెండితెర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినట్టు రాజకీయ భోగట్టా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హంగ్ నెలకొన్నట్టయితే ఈ ఒప్పందం మేరకు అధికారాన్ని పంచుకోవాలని భావిస్తున్నారు.

ఈ మేరకు తలా రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహిస్తూ.. సినీ స్నేహాన్ని రాజకీయ నిజజీతంలోనూ కొనసాగించాలని వారిద్దరు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో తెదేపా అధినేత చంద్రబాబుకు "చెక్" పెట్టాలని ఓ ప్రణాళికను రూపొందించారు.
తొమ్మిదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన చంద్రబాబు.. తమ కుటుంబానికి పెద్దగా ఒరగబెట్టిందీ ఏమీలేదని, తన అన్న హరికృష్ణకు మంత్రిపదవి ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి లాగేసుకున్నారనే అక్కసు బాలకృష్ణలో నెలకొందట. ప్రధానంగా, తన తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని యువరత్న ఏమాత్రం మరిచి పోలేదని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.
ప్రస్తుతం సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో గత్యంతరం లేక, పార్టీకి తిరిగి పూర్వవైభవం సమకూర్చేందుకు బావ చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నానని బాలకృష్ణ తన మనస్సులోని మాటను వెల్లడించారట.
అలాగే, చిరంజీవి కూడా తన మదిలోని ఆవేదనను వెండితెర స్నేహితునితో పంచుకున్నట్టు వినికిడి. అంతేకాకుండా, ఎన్నికల ప్రచారంలో తామిద్దరం ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకోరాదనే ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ప్రధానంగా, అధికార పంపిణీపైనే వీరిద్దరి మధ్య రహస్య చర్చలు సాగినట్టు సమాచారం. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు తొలుత ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని, రెండో టర్మ్‌లో రెండో వ్యక్తి బాధ్యతలు నిర్వహించేలా అంగీకారానికి వచ్చారట. ఏది.. ఏమైనా, చిరంజీవి రాజకీయ ప్రవేశంతో రాష్ట్రంలో హంగ్ తథ్యమని, ఆ సమయంలో మెగాస్టార్ కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా వుంది.