Wednesday, July 24, 2013

హరారే వన్డే : విరాట్ కోహ్లీ సెంచరీ - భారత్ గ్రాండ్ విక్టరీ

హరారేలో బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో జింబాబ్వే జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి, భారత్ ముంగిట 229 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

ఈ లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ సేన కేవలం నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 230 పరుగులు చేసి, ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (20), ధవన్ (17)లు తక్కువ స్కోరుకే ఔట్ అయినప్పటికీ.. కెప్టెన్ కోహ్లీ 108 బంతుల్లో ఓ సిక్సర్, 13 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేయగా, అంబటి రాయుడు 84 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేసి భారత జట్టు విజయానికి బాటలు వేశారు. అయితే, కోహ్లీ ఔట్ అయిన తర్వాత వచ్చిన రైనా డకౌట్ అయినప్పటికీ.. కార్తీక్, రాయుడు జోడీ జట్టును విజయం వైపు నడిపించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీకి అందజేశారు.

అంతకుముందు.. తొలుత టాస్ గెలిచిన భారత్ ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేశారు. జింబాబ్వే బ్యాట్స్‌మెన్లలో షిబాందా 34, రాజా 82, విలియమ్స్ 15, మస్కద్జా 11, టేలర్ 12, వాల్లర్ 2, చిగుంబరా 43, ముతోంబోడ్జి 8, ఉత్సేయ 13 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా మూడు వికెట్లు తీయగా, వినయ్ కుమార్, షమీ, ఉద్కుంట్, రైనాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.