అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన జడ్‌పిటిసి, ఎంపిటిసి ఉపఎన్నిక ఫలితాలు రాజకీయపక్షాలకు మిశ్రమ సంకేతాలనిచ్చాయి. జడ్‌పిటిసి స్థానాల్లో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు, మెజారిటీ ఎంపిటిసి స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో తమ వైఖరి ఎలా ఉండబోతోందో స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. ఫలితాలు ఊహించినట్లుగానే ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు హెచ్చరికలు జారీ చేశారు.

ఇక కర్నూలు జిల్లా ఆలూరులో విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లు ఆళ్లగడ్డలో డిపాజిట్ కూడా ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి షాక్‌నిచ్చారు. మరోవైపు ఆళ్ళగడ్డలో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీని విజయం వరించినా అది భూమా దంపతుల వ్యక్తిగత విజయంగానే భావిస్తున్నారు. ఆళ్ళగడ్డలో మాదిరిగానే ప్రరాపా ఆలూరులోనూ తన అభ్యర్థిని బరిలోకి దించి ఉంటే ఓటర్ల తీర్పు ఎలా ఉండేదో తేటతెల్లమయ్యేదని స్థానిక నేతల అభిప్రాయం.
జిల్లాలోనే కాదు రాష్ట వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించిన ఆళ్ళగడ్డ జడ్‌పిటిసి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించిన ప్రజారాజ్యం పార్టీ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం భవిష్యత్ శుభసూచకం. కాంగ్రెస్ అభ్యర్థిపై ఐదు వేల పైచిలుకు మెజారిటీని సాధించిన పిఆర్‌పి తెలుగుదేశం అభ్యర్థికి ధరావత్తు కూడా దక్కకుండా చేసింది.
ప్రజారాజ్యం పార్టీ బలపరిచిన మాదం రవికి 18,275 ఓట్లు రాగా, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి చెన్నయ్యకు 13,072 ఓట్లు, తెలుగుదేశంపార్టీ అభ్యర్థి కమలమ్మకు 4,635 ఓట్లు వచ్చాయి. ఆళ్ళగడ్డలో 58,643 ఓటర్లు ఉండగా, 37,340 ఓట్లు పోలయ్యాయి. వ్యక్తి ప్రాధాన్యత ఉన్న ఆళ్ళగడ్డ రాజకీయాల్లో జడ్‌పిటిసి స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఆయా అభ్యర్థుల కంటే భూమా-గంగుల-ఇరిగెల మధ్యే సాగిందనడం అక్షరసత్యం.
జడ్‌పిటిసి ఉపఎన్నికకు ఇంత ప్రాధాన్యత రావడానికి వీరి ప్రతిష్టే కారణమైంది. భూమా రాజీనామాతో ఇబ్బందుల్లో పడ్డ తెలుగుదేశం పార్టీ ఇరిగెల రూపంలో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. తెదేపా ఆళ్ళగడ్డ బరిలో నిలబడేందుకు మరింత పోరాటం చేయాల్సిందేనని ఈ ఫలితం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానం దక్కించుకుని పరువును నిలబెట్టుకోగా, తెలుగుదేశం పార్టీ మాత్రం కష్టాల్లో పడింది.
ఇక ఆలూరు జడ్‌పిటిసి ఉపఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన షాక్‌నిచ్చేదే. ఈ స్థానంలో తెదేపా అభ్యర్థి మేకల భాస్కర్‌కు 10,789 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే లోకనాథ్‌కు 9,320 ఓట్లు వచ్చాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీని విజయం వరించడం ఖాయమని ముందుగానే తేలింది. అయినా ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ విఫలమైంది. వైఎస్సార్ మంత్రివర్గంలో జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి మారెప్ప సొంత నియోజకవర్గంలో ఈ ఓటమి ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఉపఎన్నికల ఫలితం రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నా వైఎస్సార్ ఆదేశించే వరకు మారెప్ప ఆ నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడం ఓటమికి కారణమైందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక చివరిక్షణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమైన నేతలందరినీ ఆలూరు వైపుకు మళ్లించినా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు అది బలాదూర్ అయ్యింది.
ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఎంపిటిసి స్థానాల్లో మెజారిటీ స్థానాలు దక్కడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. మొత్తం ఆరు స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే అవుకు మండలం జూనూతల కాంగ్రెస్ పక్షాన ఏకగ్రీవంగా పూర్తయింది. మిగిలిన మండగిరి-2, నేమకల్లు-2, మాయలూరు, దొడ్డిమేకల, హోళగుంద-2 స్థానాల్లో దొడ్డిమేకల మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి.
మరో నాలుగు నెలల్లో జరగాల్సిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఈ ఉపఎన్నికలు రెఫరెండంగా భావించినా.. భావించకపోయినా ఓటమికి గురైన మిగిలిన పక్షాలు తమ తీరును మరోసారి పునఃసమీక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పాయన్నది మాత్రం సత్యం.