ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే తొలి మూడేళ్ళలో పది లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రజారాజ్యం ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను ఆ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ పర్వతనేని ఉపేంద్ర గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తామన్నారు. పేదలు, ధనవంతుల మధ్య అంతరాలు తగ్గిస్తామన్నారు.

రైతులకు రోజుకు పది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని పేర్కొంది. రైతులందరికీ పెన్షన్, బీమా పథకాలు ప్రవేశపెడతామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ను అందరికీ అందిస్తామని అన్నారు. ప్రతిభకు పెద్దపీట వేసి, ప్రోత్సాహిస్తామన్నారు. వంద రూపాయలకే వంట సరకులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తామని చెప్పారు.
ఆడపిల్లలకు పసుపు కుంకుమ పథకాన్ని అమలు చేస్తామన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేస్తామని కూడా తెలిపారు. చదువుకున్న వికలాంగ విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఐటీ కంపెనీలకు అసంబద్ధంగా ధారాదత్తం చేసిన భూములను రద్దు చేస్తామన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. భూములు లేని పేదలకు రెండు ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్టను అందజేస్తామన్నారు. కాగా, ఈ ముసాయిదాను ప్రజల మధ్య చర్చకు పెట్టామని, అవసరమైతే మార్పులు చేర్పులు చేసి, తుది మేనిఫెస్టోలో చేర్చుతామన్నారు.