సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. దీనికి తోడు ఎన్నికల నిబంధనలు తక్షణం అమలుకు వచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవీ.సుబ్బారావు హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు పరిశీలిస్తే..

* రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎలాంటి లౌడు స్పీకర్లను ఉపయోగించకూడదు.
* ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన గోడలపై ముందస్తు అనుమతి లేకుండా రాతలు రాయకూడదు. ఒక వేళ రాతలు రాసినా, పోస్టర్లు అంటించినా కేసులు నమోదు చేస్తారు.
* నిషిద్ధ ప్రదేశాల వద్ద సభలు, సమావేశాలు నిర్వహించరాదు.
* వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఇళ్ళ ముందు ప్రదర్శనలు, పికెటింగ్‌లు నిర్వహించరాదు.
* రోడ్ల నిర్మాణాలు, తాగునీటికి సంబంధించిన హామీలు, వాగ్ధానాలు, గ్రాంట్లు మంత్రులు ఇవ్వరాదు.
* ప్రభుత్వం ఎలాంటి తాత్కాలిక నియామకాలను చేపట్టరాదు.
* మంత్రులు వారి అధికార వాహనాలను ఇంటి నుంచి సచివాలయం వరకే వినియోగించాలి.
* ఎన్నికల సిబ్బందిని మంత్రులు తమ వద్దకు పిలిపించి, వివిధ అంశాలపై చర్చించరాదు.
* ప్రభుత్వం కొత్త పథకాలు, ప్రకటనలు చేయరాదు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల గురించి కూడా ప్రచారం చేయరాదు.
* వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అంశాలను ప్రచారంలో చొప్పించరాదు.
* ప్రార్థనా ప్రదేశాలలో ఎన్నికల ప్రచారం చేయరాదు.
* ఒక పార్టీ పోస్టర్లను మరొక పార్టీ తొలగించరాదు.
* సభలు, సమావేశాలు నిర్వహించే ముందు స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరి.
* రాజకీయ నాయకులు సమావేశాలు, బహిరంగ సభలలో గౌరవప్రదంగా, హుందాగా నడుచుకోవాలి.
* ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రజలు కూడా ఫిర్యాదు చేసే అవకాశం. దీనికోసం రాపిడ్ రెస్పాన్స్ సిస్టంను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబరు 1100ను కేటాయించారు. ఎవరైనా ఈ నంబరుకు డయల్ చేసి ఫిర్యాదులిస్తే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వెంటనే స్పందించి చర్య తీసుకుంటారు.
* ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అధికారికంగా హెలికాప్టర్‌ను వినియోగించరాదు. అభ్యర్థుల కాన్వాయ్‌లో మూడు వాహనాలకు మించి వినియోగించరాదు. ఎక్కువ వాహనాలు కలిగి ఉంటే వాటిని అభ్యర్థి ఖాతాలో ఎన్నికల ఖర్చు కిందకు జమ చేస్తారు.
* కులాలు, మతాలు జాతుల మధ్య వివాదాలు రగిల్చే విధంగా ప్రసంగాలు చేయరాదు.