Thursday, March 12, 2009

పెద్దపల్లి బరిలో చిరంజీవి వర్సెస్ రాములమ్మ!

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణాలో పోటీ చేసే రెండో స్థానం కూడా ఖరారైంది. అటు ఎన్టీపీతో సహా, ప్రజారాజ్యం పార్టీకి మంచి పట్టున్న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మెగాస్టార్ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. దీంతో ఆయనపై పోటీకి మహా కూటమి నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ విజయశాంతిని దించాలని తెరాస నిర్ణయించింది.

బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మహాకూటమి తరపున మున్నురుకాపు అభ్యర్థిని బరిలోకి దించాలని భావించారు. అయితే, ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా సినీ గ్లామర్‌ను సినీ గ్లామర్‌తోనే ఎదుర్కోవాలనే తుది నిర్ణయానికి మహాకూటమి నేతలు వచ్చినట్టు వినికిడి. నిజానికి విజయశాంతిని భువనగిరి నుంచి బరిలోకి దించాలని భావించారు.

అయితే, పెద్దపల్లి బరిలో చిరంజీవి పోటీ చేయడం ఖాయమని తెలియడంతో విజయశాంతిని బరిలోకి దింపాలని మహాకూటమి భావించినట్టు సమాచారం. అయితే మహాకూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.