Wednesday, March 4, 2009

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో జయహో గీతం

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఆస్కార్ అవార్డు సాధించిపెట్టిన "జయహో" గీతాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ ఈ గీతాన్ని స్వరపరిచిన సంగతి తెలిసిందే. ఈ గీతం ఇటీవల రెహమాన్‌కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును అందించింది.

తాజాగా దీనిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పాలన సామాన్యుడి కోసం సాగిందనే సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ గీతం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. "జయహో" పాట హక్కులను టీ - సిరీస్ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బుధవారం వెల్లడించారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన చక్‌దే చిత్రంలోని టైటిల్ సాంగ్‌ను గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది. గత ఏడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చక్‌దే పాటను ఉపయోగించింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రభుత్వం సామాన్యుడి కోసమనే సందేశాన్ని తెలిపేందుకు "జయహో"ను సిద్ధం చేస్తోంది.