Thursday, March 12, 2009

ఏ రాజుకి ఓటరన్న కిరీట ధారణం చేస్తాడో..?!!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

రానున్న లోక్‌సభ ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవిగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీని సాధించలేదని తెగేసి చెపుతున్నారు. నిజమే... ఇదివరకు జాతీయస్థాయి పార్టీల మధ్య మాత్రమే ద్విముఖ లేదా త్రిముఖ పోటీ ఉండేది. కానీ నేడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు బలోపేతమయ్యాయి. ఉన్న పార్టీలకు తోడు కొత్తగా మరికొన్ని పార్టీలు పుట్టుకొస్తున్నాయి.

దీంతో జాతీయ పార్టీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ప్రాంతీయ పార్టీల సహకారం లేనిదే నెగ్గుకు రావడం కష్టమైన పని అని తెలుసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్, భాజపాలు రెండూ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో రహస్య మంతనాలు సాగిస్తున్నాయి.

మరోవైపు వామపక్షాలు తృతీయ కూటమిని మరింత పటిష్ట పరిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని కూడగట్టి కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని అహరహం శ్రమిస్తున్నాయి.

ఇక అంతకుముందు ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన దేవెగౌడ సైతం ప్రధాని పీఠంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సంభాషణలను సాగిస్తున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఎలాగైనా తృతీయ కూటమిలోకి ఆకర్షించాలన్న ప్రయత్నం కూడా ఇందులో భాగంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సైతం ప్రధాని రేసులో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ ఉందనీ, పార్టీ ప్రాబల్యం ఉన్న చోట్ల తమ అభ్యర్థులను పోటీకి నిలుపుతామని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవల కాలంలో బహిరంగ సభలలో పాల్గొంటూ వస్తున్నారు.

ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ప్రధాని పదవిపై కన్ను వేశారని వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకుగాను అత్యధిక స్థానాలను గెలుచుకుని ఓ నిర్ణయాత్మక శక్తిగా అవతరించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే చంద్రబాబు యువరత్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్... ఇలా నందమూరి వారసులందరినీ రాష్ట్రంలో తలో దిక్కున ప్రచారం చేయించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు భోగట్టా.

మరి అన్ని సీట్లూ మావేనంటున్న కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య తెలుగుదేశం ఆశలు ఎంతవరకూ నెరవేరతాయో వేచి చూడాల్సి ఉంది. మొత్తమ్మీద మాంద్యంలో సైతం వచ్చే ఎన్నికలలో డబ్బు ధారాపాతంగా పారుతుందని పలు సర్వేలు ఇప్పటికే ఎలుగెత్తి చాటుతున్నాయి. అధికారం దక్కించుకోవడంకోసం మన రాష్ట్రంలో పలు రాజకీయ నాయకులు కోటానుకోట్ల డబ్బులు కుమ్మరిస్తారన్న వాదనలు సైతం వినబడుతున్నాయి.

మరి ఇన్ని పార్టీలు, ప్రత్యామ్నాయాల నడుమ ఓటరన్న ఏ రాజకీయ పార్టీ నేతకు కిరీటం ధరింపజేస్తాడో వేచి చూడాలి.