ప్రజారాజ్యం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల గుర్తును మరో పార్టీ నుంచి అరువు తెచ్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. తమకు సొంతగా ఉమ్మడి గుర్తు కోసం చివరి నిమిషం వరకు న్యాయ పోరాటం చేయాలని, తమ కృషి ఫలించని పక్షంలో కమలంతో చెలిమి చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇటీవల పార్టీలో చేరిన రాజకీయ సీనియర్ నేత తూళ్ళ దేవేందర్ గౌడ్‌తో రహస్య మంతనాలు జరిపించినట్టు సమాచారం.

న్యూఢిల్లీకి వెళ్లిన గౌడ్, భాజపా ప్రధాన కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ప్రకాష్ జావ్‌దేకర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. తమ చెలిమి ఫలించేందుకు పీఆర్పీ ప్రధాన కార్యదర్శి, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్‌ను రంగంలోకి దించాలని వారిరువురు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఎన్నికల్లో ఒక పార్టీ గెలుపోటములను ప్రభావితం చేయడంలో పార్టీ గుర్తు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భాజపా ఎన్నికల చిహ్నం కమలం. ఈ గుర్తు సామాన్య ప్రజలందరికీ చిరపరిచితం. అభ్యర్థుల కన్నా, ఎన్నికల గుర్తు ఓటర్లను మరింత ప్రభావితం చేస్తోంది. దీనికి తోడు, భాజపాకు పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు.
ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ రెండు కలిస్తే.. రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు సాధించవచ్చన్నది ఇరు పార్టీల నేతల అభిప్రాయం. అందుకే, ప్రజారాజ్యం పార్టీకి ఎన్నికల గుర్తు లభించని పక్షంలో కమలంతో చెలిమి చేసి, ఆ గుర్తుపై పోటీ చేయాలని పీఆర్పీ నేతలు పలువురు భావిస్తున్నారు.
అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీకి దేశ స్థాయిలో ఒక జాతీయ పార్టీ అండ లభించినట్టు అవుతుందని ఆ పార్టీ నేతల ఉద్దేశ్యంగా ఉంది. అయితే, కమలం గుర్తుపై పోటీ చేయడం వల్ల ఉత్పన్నమయ్యే నష్టాలను బేరీజు వేయడంలో చిరంజీవి నిమగ్నమై వున్నారు. ఎందుకంటే భాజపా మతత్వ పార్టీగా ముద్ర పడిన విషయం తెల్సిందే. అందువల్ల చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.