Tuesday, March 3, 2009

నాకు రాజకీయ లక్ష్యాలేమీ లేవు: ప్రియాంకా

న్యూస్ ఇండియా బ్యూరో

అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో మంగళవారం పర్యటించిన ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యారు. వారికి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని ప్రియాంకా గాంధీ ఈ సందర్భంగా తోసిపుచ్చారు.

తన సోదరుడు, తల్లి కోసం మాత్రమే పనిచేస్తున్నానని చెప్పారు. వారు వేరేచోట్ల ప్రచార కార్యక్రమాలతో తీరికలేకుండా గడుపుతున్న కారణంగా, వారి తరపున తాను ఇక్కడ పనిచేస్తున్నానని తెలిపారు. తనకు ప్రత్యేకంగా ఎటువంటి రాజకీయ లక్ష్యాలేమీ లేవని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.

పార్టీని బలపరిచేందుకు, సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీల తరపున ప్రచారం చేసేందుకు అమేథీ, రాయ్‌బరేలీ పర్యటనకు వచ్చానని మున్షిగంజ్ అతిథి గృహంలో ఆమె విలేకరులతో చెప్పారు.

ఎన్నికల్లో పోటీ చేయాలని వస్తున్న ప్రతిపాదనలను పరిశీలిస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంకా గాంధీ వద్రా బదులిస్తూ.. ఇది చాలా పాత డిమాండ్ అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై ప్రతిపక్ష బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. తాను రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కాదని, దీనిపై మాట్లాడబోనని చెప్పారు.