Thursday, March 5, 2009

గాంధీ వస్తువులు సొంతం చేసుకున్న మాల్యా

న్యూస్ ఇండియా బ్యూరో

అనేక ఆసక్తికర మలుపుల తర్వాత గాంధీ వస్తువులు మళ్లీ భారత్ చేరే అవకాశం లభించింది. అమెరికాలో గురువారం జరిగిన వేలంలో పాల్గొన్న విజయ్ మాల్యా 1.8 బిలియన్ అమెరికన్ డాలర్లకు గాంధీ వస్తువులను సొంతం చేసుకున్నారు. దీంతో మార్గం ఏదైనా గాంధీ వస్తువులు మళ్లీ భారత్ చేరే అవకాశం లభించింది.

అదేసమయంలో రెండు వారాల తర్వాత మాత్రమే గాంధీ వస్తువులు మాల్యా చేతికి చేరనున్నాయి. ఈ వేలంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని నివృతి చేసేందుకై గాంధీ వస్తువులను వేలం సంస్థ రెండు వారాల వరకు తమ దగ్గరే పెట్టుకోనుంది. ఈ విషయమై మాల్యా తరపున వేలంలో పాల్గొన్న టోనీ బెడి మాట్లాడుతూ వేలం ద్వారా వస్తువులను చేజిక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. వేలంలో తాము వేసిన బిడ్ దేశం తరపున వేసినదని అందుకే గాంధీ వస్తువులు మళ్లీ భారత్‌కే చేరుతున్నాయని అన్నారు.

గాంధీ ఆనాడు ఉపయోగించిన కళ్ల జోడు, ఒక జత చెప్పులు, వాచీ, తినే పళ్లెం, చెంబులను సేకరించిన అమెరికాకు చెందిన జేమ్స్ ఓటిస్ వీటిని వేలం వేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే గాంధీ వస్తువులను వేలం వేయడం సరికాదంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దీంతో భారత ప్రభుత్వం గాంధీ వస్తువులను వెనక్కి తెప్పించేందుకు ఓటీస్‌తో చర్చలు ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఓటిస్ భారత ప్రభుత్వానికి కొన్ని షరత్తులు పెట్టారు. ఈ షరత్తులకు భారత ప్రభుత్వం ఒప్పుకోకముందే వేలం నిర్వహించడం జరిగింది. అయితే ఈ వేలంలో పాల్గొన్న భారతీయ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా గాంధీ వస్తువులను దక్కించుకోవడంతో ఈ కథ సుఖాంతమైనట్టైంది.