ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్
ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో మహాకూటమిలో సీట్ల పంపిణీపై చర్చలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం, తెలంగాణా రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెదిన సీనియర్ నేతలు ఈ చర్చల్లో పాలు పంచుకుంటున్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తెరాస, వామపక్షాలకు కేటాయించగా మిగిలిన 215 అసెంబ్లీ, 29 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని తెదేపా నిర్ణయించింది. సిపిఐ, సిపిఎం పార్టీలు 18 అసెంబ్లీ, రెండేసి లోక్‌సభ సీట్ల చొప్పున కేటాయించాలని భావించినట్టు తెలుస్తోంది.
ఈమేరకు ఇటీవల మహాకూటమి నేతల ఢిల్లీ పర్యటనలో ఖరారైనట్టు సమాచారం. అలాగే తెరాస మాత్రం 48 అసెంబ్లీ, తొమ్మిది లోక్‌సభ సీట్లలో భర్తీ పోటీ చేయనుంది. ఇదిలావుండగా నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్, ఖమ్మం, అరకు నియోజకవర్గాల్లో ఏ నాలుగింటిలోనైనా రెండు వామపక్షాలు ఎంచుకోవచ్చని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.
నల్గొండ తమకు వద్దని ఆ పార్టీలు చెప్పినట్టు సమాచారం. అయితే సీట్ల కేటాయింపులో ఒక అవగాహనకు వచ్చినప్పటికీ, స్థానాల కేటాయింపులో మాత్రం నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదన్నది ఆ కూటమి వర్గాల సమాచారం.