ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తుందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం ఎచ్ ఎన్ ఎన్ తో మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు తాము సానుకూలమని తిరుపతి సభలోనే స్పష్టంగా ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తే వర్గీకరణపై మరోసారి తీర్మానం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ అంశం ఇంత పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరే ప్రధాన కారణమన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దండోరా నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, విధ్వంసాలకు, ఉద్రిక్తతలకు దారితీయడం, పలువురు గాయపడడం, దాడుల సందర్భంగా కొందరు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటనగా ఆయన వ్యాఖ్యానించారు.
ఈనెల పదో తేదీలోగా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని చిరంజీవి మరో ప్రశ్నకు జవాబిచ్చారు. తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి విపరీతమైన స్పందన వస్తున్నదని ఆయన చెప్పారు. కేంద్రంలో నాలుగో కూటమి ఏర్పాటు కోసం తాము ప్రయత్నిస్తామని చిరంజీవి వెల్లడించారు. అయితే, ఇప్పటికీ ఉన్న మహాకూటమిలో చేరాల్సిందిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చేసిన విజ్ఞప్తిని చిరంజీవి తిరస్కరించారు.