Wednesday, July 31, 2013

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రకటించే 'దమ్ము' ఎలా వచ్చిందంటే...?!!

రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇవ్వాలన్న దమ్మూ ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు వచ్చింది...? ఎలా వచ్చిందని అంటే విశ్లేషకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

తెలంగాణ ఇవ్వాలన్న నిశ్చయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందుగా సమైక్యవాదనను బలంగా వినిపిస్తున్న కావూరి సాంబశివరావు, చిరంజీవి వంటివారితోపాటు మొత్తం ఏడుగురు ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులను కట్టబెట్టి వారి నోళ్లు మూయించేసింది. 2009 ప్రకటన సమయంలో ఇలాంటి పరిస్థితి లేకపోవడం వల్లనే అప్పుడు వారంతా రోడ్డెక్కారు. కనుక ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు మంత్రి పదవులతో వారి నోళ్లు నొక్కేశారు.

తెలంగాణపై చర్చలు జరుగుతుండగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరాస ఘోరంగా వెనకబడింది. కాంగ్రెస్ 4342, తెలుగుదేశం 4275 సర్పంచి స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. దీంతో తెలంగాణపై అనుకూల వైఖరి వల్లనే తమకు మెజారిటీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విశ్వసించింది.

తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించే ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది ఎంపీలు కలిసి తమ అంసతృప్తిని వ్యక్తం చేశారు. ఐతే సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ మోసగించే పని చేయదంటూ సోనియా గాంధీ వారిని బుజ్జగించి నోరు మెదపకుండా చేశారు. ఐతే విభజన ప్రకటన తర్వాత ఎంపీలు చాటుమాటుగా మోసం జరిగిపోయిందంటూ బాధపడటం వేరే విషయం.

రాష్ట్ర విభజన విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియపరిచినప్పుడు ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. రాజీనామాకు కూడా సిద్ధపడ్డారని సమాచారం. ఐతే ఆయన నిర్ణయాన్ని వాయిదా వేయించి బుజ్జగించి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సంయమనం పాటించాలని చెప్పి పంపినట్లు తెలుస్తోంది.

ఇక అన్నిటికీ మించి తెరాస చీఫ్ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని బాహాటంగా ప్రకటించేశారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పెద్దలు కొందరు కేసీఆర్తో మాట్లాడి వ్యవహారాన్ని నడిపించారనీ, అందులో కె. కేశవరావు వంటి సీనియర్ నాయకులు ఉన్నారని సమాచారం. ఐతే కాంగ్రెస్ ప్రకటన తర్వాత విలీనం సంగతి తర్వాత చూద్దాం అని కేసీఆర్ చెప్పడం వేరే విషయం. ఇలా మొత్తమ్మీద ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేసింది.