మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, సమైక్య సెగలతో రగిలిపోతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సమస్యకు చరమగీతం పాడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సరంజామా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని సీమాంధ్ర మంత్రుల వద్ద సూచనప్రాయంగా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన అంశం లేదా సమైక్యం అన్నది ప్రజల్లో ఎంతమేరకు ఉన్నదన్నది ప్రశ్నార్థకంగానే మారింది. ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయింది. ఏ పార్టీకాపార్టీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని వాడుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఎన్నికలు మరో ఏడాది దూరంలో ఉన్న నేపధ్యంలో తెలంగాణ సమస్య తలనొప్పిని వదిలించుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. ఇదిలావుండగా తెలంగాణ ఏర్పాటు తథ్యం అని తేలిన నేపధ్యంలో సీమాంధ్ర నాయకులు తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, పళ్లం రాజులను పంపి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అడిగేందుకు దూతలకు పంపనున్నారు. మరి సోనియా గాంధీ వారి విన్నపాన్ని ఆలకించి సమైక్యానికి ఓకే అంటారో విభజన తప్పదని తేల్చి చెపుతారో చూడాలి.