రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేయవచ్చని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు తీసుకున్న రాజీనామా నిర్ణయంతో అధికార కాంగ్రెస్, టీడీపీలు ఇరుకున పడేలా చేశాయి. తమ పదవులకు రాజీనామా చేస్తూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడవచ్చని వస్తున్న ఊహాగానాలు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు హెచ్చరికలు, పంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జగన్ పార్టీ శాసనసభ్యులు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో ఆ పార్టీ నేతలు సీమాంధ్రలో హీరోలుగా మిగిలిపోనున్నారు.
అదేసమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసే ఉద్దేశ్యంలో భాగంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా పర్వానికి తెర తీసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పాలని, ఆ తర్వాత రాష్ట్రంలోని పార్టీలతో సంప్రదింపులు జరపాలని వారు డిమాండ్ చేయడం గమనార్హం. ఇలా డిమాండ్ చేయడంలోనూ రాజకీయ వ్యూహాత్మకత, చతురత దాగి ఉందని వారు పేర్కొన్నారు.
నిజానికి తెలంగాణలో జగన్ పార్టీకి పెద్దగా నేతలు లేరు. దీంతో ఆది నుంచి ఆ పార్టీకి పట్టులేదు. ఈ విషయం తాజాగా వెల్లడైన తొలి దశ పంచాయతీ ఎన్నికల ద్వారా తేటతెల్లమైంది. ఒక్క పాలమూరు మిగిలిన ఏ జిల్లాలోను ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించలేదు. దీంతో తెలంగాణలో తమ పార్టీ తేలిపోవడంతో సీమాంధ్ర ప్రాంతంలోనైనా మరింత పట్టు పెంచుకునే ఉద్దేశ్యంలో భాగంగానే జగన్ పార్టీ నేతలంతా ఒక్కసారి రాజీనామా పర్వానికి తెర తీశారన్నది ప్రతి ఒక్కరి వాదనగా ఉంది. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇరుకున పడ్డారు.