ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్
ఈ పర్యాయం ప్రధాన రాజకీయ పార్టీలు తమ నిధుల కోసం ఏ సంస్థలపై ఆధారపడుతున్నాయి? పార్టీలకు ఎన్నికల కోసం అందే విరాళాలలో అధిక భాగం నల్ల ధనమేననే సంగతి విదితమే. కాని ఇటీవలి కాలంలో పార్టీలకు నిధులు సమకూరుస్తున్నప్రముఖ భారతీయ కార్పోట్ సంస్థల గురించి నిశితంగా పరిశీలిస్తే ఎవరు, ఎవరికి, ఎంత మేరకు నిధులు సమకూరుస్తున్నారో విదితం కాగలదు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన విరాళాలను బట్టి చూస్తే ఏ కార్పొరేట్ కంపెనీలు ఏ పార్టీని భుజానికి ఎత్తుకున్నాయో కూడా స్పష్టం కాగలదు.
అయితే, ఈ కంపెనీలలో కొన్ని మాత్రం విరాళాలు ఇచ్చే విషయంలో తమ రాజకీయ అభిమతం వెల్లడి కాకుండా జాగ్రత్తలు పాటించాయి. ఇలాంటి కంపెనీలు దేశంలోని ప్రధాన పార్టీలన్నింటికి తమ విరాళాలను దాదాపుగా సమానంగా పంచాయి. విరాళాల వితరణ విషయంలో మరికొన్ని కంపెనీలు గత ఎన్నికలలో ఒక్కొక్క ప్రధాన పార్టీ సంపాదించిన వోట్లు లేదా సీట్ల శాతాన్ని బట్టి వారు విరాళాలు పంపిణీ చేశాయి.
కాంగ్రెస్ కు ప్రధానంగా ఆదిత్య బిర్లా గ్రూపు, టాటా గ్రూపుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి అనిల్ అగర్వాల్ కు చెందిన స్టెర్లైట్ గ్రూప్, గుజరాత్ కేంద్రంగా గల అదానీ గ్రూపుల నుంచి గణనీయంగా విరాళాలు అందాయి. వీడియోకాన్ సంస్థ అధిపతులు ధూత్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ తోపాటు బిజెపికి, మహారాష్ట్రలో శివసేనకు విరాళాలు అందజేస్తున్నారు.
సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టాన్ని ఉపయోగించి 'డిఎన్ఎ' వార్తా సంస్థ 2003, 2007 మధ్య వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల గురించిన అధికారిక గణాంకాలను సేకరించింది. ఈ విరాళాల వెల్లడి ఐచ్ఛికం అయినందున ఈ గణాంకాలు సూచనప్రాయమైనవే గాని వాస్తవాలను వెల్లడించేవి కాకపోవచ్చు. అందువల్ల మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి)కి సంబంధించిన వివరాలేవీ లేవు. బిఎస్ పి ఎన్నికల కమిషన్ కు ఏ గణాంకాలనూ సమర్పించలేదు.
ఈ గణాంకాల ప్రకటనలలో అంబానీ సోదరుల విరాళాల వివరాలు కూడా లేవు. ముఖేష్ అంబానీకి కాంగ్రెస్ లో అత్యున్నత స్థాయి నాయకులతో సంబంధాలు ఉండగా అనిల్ అంబానీకి సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) నాయకుడు అమర్ సింగ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2003 - 2007 మధ్య వివిధ రాజకీయ పార్టీలకు అందిన విరాళాలలో సింహభాగం కాంగ్రెస్, బిజెపిలదే. ఈ రెండూ దాదాపు సమాన మొత్తాలను అందుకున్నాయి. కాంగ్రెస్ కు 52.42 కోట్లు, బిజెపికి 52.93 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద అందాయి. భారత రాజకీయ వ్యవస్థలో ఈ రెండు ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా వీటి ఆగ్రహానికి గురి కావడానికి ఏ బడా వాణిజ్య సంస్థా కోరుకోదు. కాని సంకీర్ణాలు కూడా ప్రాముఖ్యం సంతరించుకుంటున్నందున చిన్న పార్టీలు కూడా కొద్దో గొప్పో వాణిజ్య సంస్థల విరాళాలు అందుకుంటున్నాయి.
చిన్న పార్టీలకు పెద్ద మొత్తాలు
వాణిజ్య సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న పార్టీలలో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీలలో శివసేన (రూ 4.17 కోట్లు), సమాజ్ వాది పార్టీ (రూ. 2.45 కోట్లు), తెలుగు దేశం పార్టీ (రూ. 2.25 కోట్లు), కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అన్బుమణి రామదాస్ కు చెందిన పిఎంకె (రూ. 2.86 కోట్లు) చెప్పుకోదగినవి.
బడా దాత బిర్లా
కుమార మంగళం బిర్లా అధ్యక్షతన గల ఆదిత్య బిర్లా గ్రూప్ దేశంలో పెద్ద దాత సంస్థగా ఆవిర్భవించింది. ఈ గ్రూప్ రూ. 24.67 కోట్ల మేరకు విరాళాలు అందజేసింది. దీనిలో సింహభాగం రూ. 21.71 కోట్ల మేరకు కాంగ్రెస్ కు అందగా బిజెపికి రూ. 2.96 కోట్లు అందాయి. బిర్లా జనరల్ ఎలక్టొరల్ ట్రస్ట్ ఈ రెండింటికి మాత్రమే విరాళాలు అందజేసింది. బిజెపి రాజకీయ అవసరాల కోసం సిల్వాసాలో గల పబ్లిక్ అండ్ పొలిటికల్ అవేర్ నెస్ ట్రస్ట్ ప్రధానంగా నిధులు అందజేస్తున్నది. బిజెపి 2003, 2007 మధ్య ఈ ట్రస్ట్ నుంచి రూ. 9.5 కోట్లు అందుకున్నది. ఈ ట్రస్ట్ కు నిధులు ఎక్కువగా అనిల్ అగర్వాల్ కు చెందిన స్టెర్లైట్ గ్రూప్ నుంచి అందుతుంటాయి.
2000 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ బాల్కోలో 51 శాతం వాటాలను అప్పటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) ప్రభుత్వం స్టెర్లైట్ గ్రూపునకే విక్రయించింది. స్టెర్లైట్ ఇండస్ట్రీస్ కాంగ్రెస్ పార్టీకి కోటి రూపాయలను, బిజెపికి రూ. 50 లక్షలను విరాళంగా అందజేసింది. వేణుగోపాల్ ధూత్ సారథ్యంలోని వీడియోకాన్ వినిమయ వస్తువుల గ్రూప్ బిజెపి, కాంగ్రెస్, శివసేన పార్టీలకు రూ. 10 కోట్లకు పైగా విరాళాలు అందజేసింది. ఇందులో రూ. 4.5 కోట్లు కాంగ్రెస్ కు, రూ. 3.5 కోట్లు బిజెపికి అందగా శివసేనకు రూ. 2.63 కోట్లు సమకూరాయి. ధూత్ సోదరుడు రాజ్ కుమార్ శివసేన సౌజన్యంతో రాజ్యసభలో సభ్యుడుగా ఉన్నారు.
ఇక టాటా గ్రూపు రూ. 4.32 కోట్లను కాంగ్రెస్ కు, రూ. 2.67 కోట్లను బిజెపికి విరాళంగా అందజేసింది. ఈ గ్రూపు నుంచి శివసేనకు రూ. 60.94 లక్షలు, టిడిపికి రూ. 48.48 లక్షలు అందాయి. ఎలక్టొరల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాలు అందజేశారు. పారదర్శకంగా రాజకీయ నిధులను సమకూర్చడాన్ని ప్రోత్సహించడం కోసం 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.
సరకుల ట్రేడింగ్, వంటనూనెల వ్యాపారం, మౌళిక వసతుల కల్పన, ప్రైవేట్ రేవు కార్యకలాపాలు వంటి లావాదేవీలు నిర్వర్తించే గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ బిజెపికి ఇతోధికంగా విరాళాలు ఇస్తున్నది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో గౌతమ్ అదానీకి గల సాన్నిహిత్యం కారణంగా బిజెపికి రూ. 4 కోట్లు విరాళాలుగా అందాయి. కాంగ్రెస్ కు ఈ గ్రూపు నుంచి రూ. 20 లక్షలు విరాళాలు అందాయి. నరేంద్ర మోడి తరచు గౌతమ్ అదానీ ప్రైవేట్ విమానాలను తన పర్యటనలకు ఉపయోగిస్తుంటారు.
ఇక ప్రొఫెషనల్ తరహా మేనేజ్ మెంట్ గల ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటిసి సంస్థ) ప్రతి పార్టీ పార్లమెంటరీ ప్రాతినిధ్యం ప్రాతిపదికగా విస్తృతంగా విరాళాలు అందజేస్తుంటుంది. ఈ సంస్థ రూ. 1.45 కోట్లను కాంగ్రెస్ కు, రూ. 1.38 కోట్లను బిజెపికి, రూ. 36 లక్షలను సమాజ్ వాది పార్టీకి, రూ. 12 లక్షలను శివసేనకు, రూ. 14.5 లక్షలను టిడిపికి, రూ. 8 లక్షలను జనతా దళ్ (యు)కు, రూ. 5 లక్షలను ఎఐఎడిఎంకెకు అందజేసింది. భారీ ఇంజనీరింగ్ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) బిజెపికి రూ. 1.6 కోట్లు, కాంగ్రెస్ కు కోటి రూపాయలు, శివసేనకు రూ. 35 లక్షలు మేరకు విరాళాలు అందజేసింది. ఇక మహీంద్రా గ్రూపు కాంగ్రెస్, బిజెపి, శివసేన, టిడిపిలకు రూ 2.2 కోట్లను పంచింది. బజాజ్ గ్రూపు కాంగ్రెస్, బిజెపిలకు చెరొక కోటి రూపాయలు విరాళాలు ఇచ్చింది.
కాంగ్రెస్ టిక్కెట్ పై లోక్ సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ ఆ పార్టీకి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఆయన కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి బిజెపికి కూడా రూ. 75 లక్షలు విరాళంగా అందజేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు కాంట్రాక్టులు సంపాదించిన జిఎంఆర్ గ్రూపు బిజెపికి కోటి రూపాయలు, కాంగ్రెస్ కు రూ. 25 లక్షలను జిఎంఆర్ పవర్ కార్పొరేషన్, దాని ప్రమోటర్ల ద్వారా అందజేసింది. 2005 జూన్ లో విజయ్ మాల్యా పరమైన షావాలెస్ గ్రూప్ బిజెపికి 2004-05లో కోటి రూపాయలను విరాళంగా అందజేసింది.
పార్టీలకు విరాళాలు అందజేసిన వాణిజ్య సంస్థల జాబితాలో ఇంకా పెక్కు ప్రముఖ పేర్లు ఉన్నాయి. ఫార్మా సంస్థ రాన్ బాక్సీ కాంగ్రెస్ కు రూ. 65 లక్షలు, బిజెపికి రూ. 35 లక్షలు, టిడిపికి రూ. 5 లక్షలు వెరసి రూ. 95 లక్షలు విరాళాలు అందజేసింది. ఎల్ఎం థాపార్ గ్రూపు కాంగ్రెస్, బిజెపిలకు రూ. 70 లక్షల మేరకు విరాళాలు అందజేసింది. ఉమేష్ మోడి గ్రూపు బిజెపికి రూ. 50 లక్షలు, కాంగ్రెస్ కు రూ. 25 లక్షలు అందజేసింది.
అంత పేరు ప్రఖ్యాతులు లేని విరాళాల దాతలలో అకిక్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఉంది. ఢిల్లీ షాదారాలోని బలదేవ్ పార్క్ ప్రాంతంలో గల ఈ సంస్థ బిజెపికి కోటిన్నర రూపాయలు విరాళంగా అందజేసింది. సదరు అడ్రెస్ లో మూడంతస్తుల భవనం ఉంది. కాని డిఎన్ఎ వార్తా సంస్థ విలేకరికి అక్కడ ఏ విద్యా సంస్థా కనిపించలేదు. అహ్మదాబాద్ కు చెందిన నిమా స్పెసిఫిక్ ఫ్యామిలీ ట్రస్ట్ బిజెపికి కోటి రూపాయలు, కాంగ్రెస్ కు రూ. 30 లక్షల మేరకు విరాళాలు అందజేసింది.
చట్టం అంచున మాత్రమే పని చేస్తుండే రియల్ ఎస్టేట్ గ్రూపులు కూడా ప్రధాన పార్టీల విరాళాల దాత సంస్థలలో స్థానం సంపాదించాయి. మాల్స్, లగ్జరీ అపార్ట్ మెంట్లు నిర్మిస్తుండే, రాజ్ సింగ్ గెహ్లాట్ సారథ్యంలోని ఏంబియెన్స్ గ్రూపు తన గ్రీన్ పార్క్ ఎక్స్ టెన్షన్ ఆఫీసు నుంచి కాంగ్రెస్ కు రూ. 1.05 కోట్లు విరాళంగా అందజేసింది. ఢిల్లీకి చెందిన మరొక నిర్మాణ సంస్థ సోమదత్ బిల్డర్స్ బిజెపికి రూ. 75 లక్షలు విరాళంగా అందజేసింది.
ఇంజనీరింగ్, కన్ స్ట్రక్షన్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ సంస్థ పుంజ్ లాయిడ్ బిజెపికి కోటి రూపాయలు విరాళంగా అందజేసింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ టుడే హౌస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ కాంగ్రెస్ కు రూ. 55 లక్షలను అందజేసింది. హైపర్, సూపర్ మార్కెట్ లను ఏర్పాటు చేస్తుండే జూబిలెంట్ గ్రూపు రూ. 50 లక్షలను, రియల్ ఎస్టేట్ సంస్థ క్రెడా రూ. 47 లక్షలను బిజెపికి అందజేశాయి. సంస్కృతి డెవలపర్స్ సంస్థ కాంగ్రెస్ కు రూ. 50 లక్షలు, శివసేనకు రూ. 15 లక్షలు విరాళంగా అందజేసింది. అంతగా పేరు ప్రఖ్యాతులు లేని ట్రస్ట్ ల నుంచి సుప్రసిద్ధ పారిశ్రామిక సంస్థల వరకు రాజకీయ పార్టీల చక్రాల కదలికకు చేయూత ఇచ్చాయన్నది ఈ జాబితా ద్వారా విదితమవుతున్నది.