Thursday, March 5, 2009

ఫస్ట్ లిస్ట్ లోనే కళంకితులు!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

మన రాజకీయాలు ఏవిధంగా నేరమయం అయ్యాయో చెప్పేందుకు ఇదిగో నిదర్శనం. రానున్న లోక్ సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలలో నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల పేర్లు కనీసం 18 చోటు చేసుకున్నాయని రాజకీయ జీవితంలో రుజువర్తనం కోసం పాటుపడే ఎన్ జిఒ 'నేషనల్ ఎలక్షన్ వాచ్' (ఎన్ఇడబ్ల్యు - న్యూ) వెల్లడించింది. వారిలో నలుగురు కాంగ్రెస్ కు, ఎనిమిది మంది బిజెపికి, ఆరుగురు ఎస్ పికి చెందినవారు. ఇది ప్రారంభం మాత్రమే. పార్టీల పూర్తి అభ్యర్థుల జాబితాలు ఇంకా వెలువడవలసి ఉంది కదా!

'కళంకిత' అభ్యర్థులలో ఎస్ పి అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, రాజకీయ నాయకుడుగా మారిన నటుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పక్షాన ఉన్న రాజ్ బబ్బర్, బిజెపి నుంచి అనంత కుమార్, రమాకాంత్ యాదవ్, క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. క్రిమినల్ బెదరింపు నుంచి చంపుతాననే బెదరించడం, ప్రభుత్వోద్యోగులపై దౌర్జన్యం, అల్లర్లు లేవదీయడం వరకు వారిపై ఆరోపణలు నమోదై ఉన్నాయి. వాస్తవానికి సిద్ధూను ఒక హత్య కేసులో దోషిగా నిర్థారించారు. అయితే, అతనికి విధించిన శిక్షపై స్టే మంజురైంది.

మూడు పార్టీలు ఇంతవరకు ప్రకటించిన 169 మంది అభ్యర్థులలో 71 మంది దాఖలు చేసిన పూర్వ చరిత్రకు సంబందించిన అఫిడవిట్లను 'న్యూ' పరిశీలించింది. కాంగ్రెస్ 24 మంది, బిజెపి 92 మంది, ఎస్ పి 53 మంది అభ్యర్థుల పేర్లను ఇంతవరకు ప్రకటించాయి.

యుపిలోని మైన్ పురి నుంచి పోటీ చేస్తున్న ములాయం సింగ్ యాదవ్ పై గల కేసులలో క్రిమినల్ ఉల్లంఘన, కుట్ర నుంచి ఇతరుల పేరును చెడగొట్టేందుకు ఫోర్జరీ చేయడం వరకు కేసులు ఉన్నాయి. ములాయం ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఆరోపణపై సిబిఐ దర్యాప్తు పెండింగ్ లో ఉన్న విషయం విదితమే.

రషీద్ మసూద్ (శహరాన్ పూర్), కున్వర్ రేవతీ రమణ్ సింగ్ (అలహాబాద్), బ్రిజ్ భూషణ శరణ్ సింగ్ (కైజర్ గంజ్), దీపక్ కుమార్ (ఉన్నావ్), అశోక్ కుమార్ సింగ్ చాందెల్ (హమీర్ పూర్) వంటి ఇతర ఎస్ పి అభ్యర్థులపై కూడా అల్లర్లు, చట్టవిరుద్ధంగా గుమిగూడడం, బెదరింపులకు పాల్పడడం వంటి కేసులు నమోదై ఉన్నాయి. కాంగ్రెస్ జాబితాలోని కళంకిత అభ్యర్థులలో రాజ్ బబ్బర్ (ఫతేపూర్ సిక్రీ) కాకుండా సురేంద్ర ప్రకాశ్ గోయెల్ (బన్స్ గావ్), జగదంబికా పాల్ (దొమారియాగంజ్), రత్నా సింగ్ (ప్రతాప్ గఢ్) కూడా ఉన్నారు. అల్లర్లు లేవదీశారనే అభియోగాలు బబ్బర్, గోయెల్ లపై నమోదయ్యాయి. బిజెపి కళంకితుల జాబితాలో ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), అనంతకుమార్ హెగ్డె (ఉత్తర కన్నడ), లల్లూ సింగ్ (అయోధ్య), సుభాష్ చంద్ర బర్మన్ (బేలూర్ ఘాట్), భాను ప్రతాప్ సింగ్ వర్మ (జల్గావ్) కూడా ఉన్నారు.

'నేర చరిత్ర కలిగి ఉన్న రాజకీయ నాయకుల సంఖ్య ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువగా ఉంది. ఈ శక్తుల కారణంగా శాసనసభ, పార్లమెంట్ సరిగ్గా పని చేయలేకపోతున్నాయి. మనం నిష్కళంకులైన, సమర్థులైన అభ్యర్థులనే ఎన్నుకోవాలి' అని 'న్యూ' సమన్వయకర్త ఐ.సి. ద్వివేది సూచించారు.