ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్
ఒకవైపు టి20 క్రికెట్ సంబరాలు తెస్తున్న ఐపిఎల్ టోర్నమెంట్, మరోవైపు ఉత్కంఠభరితంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ఎండాకాలాన్ని మరింతగా మండించబోతున్నాయి. ఏప్రిల్ 16, మే 16 మధ్య 15వ సార్వత్రిక ఎన్నికలు; ఏప్రిల్ 10 నుంచి మే 24 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండవ టోర్నీ పోటాపోటీగా జనం ముందుకు దూసుకురాబోతున్నాయి. జనం ఊహాశక్తిని గౌరవిస్తూనే, పార్టీల ఆర్భాటపు ప్రచారంతోను, మెలితిరిగిన డబ్బు యంత్రాలతోను బూత్, బ్యాట్ సమరాలు 'మరీ అతిగా' కనిపిస్తుంటే ఆశ్చర్యపోకండి. రాజకీయ ర్యాలీలకు హాజరు కావాలా లేక క్రికెట్ పోటీలకు వెళ్ళాలా లేక పోలింగ్ కేంద్రాలు, స్టేడియాల వద్ద ఎన్నికల కమిషన్, ఐపిఎల్ నిర్వాహకులు నియోగించే వేలాది మంది భద్రతా సిబ్బంది మధ్య పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని ఎలా వెతకాలా అనే డైలమా గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు.
ఇది ఆర్థిక వ్యవస్థ గురించి చర్చా కాదు. వనరులకు కొరత ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలా అనే మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే సైన్స్ గురించిన చర్చా కాదు. ఈ ఆర్థిక మాంద్యం సమయంలో డబ్బుకు గల ప్రాధాన్యం గురించే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. మెరుగైన భవిత కోసం జాతి పెట్టుకున్న ఆశలతో ఆడుకునే ఖద్దరు ధారులకు, ఫ్లడ్ లిట్ స్టేడియాలలో రంగు రంగుల పైజామాలు ధరించి ఆడే క్రీడాకారులకు పుష్కలంగా ఆ వ్యక్తులే నిధులు సమకూరుస్తుంటారు. డబ్బు సంచులు ఇతోధికంగా ఉన్న సంస్థలు ఖద్దరుధారులకు వోటు వేయవచ్చు. క్రికెట్ ఒక క్రీడ మాత్రమే. కాని బడా వాణిజ్యవేత్తలను వాణిజ్య లావాదేవీలు కొనసాగించేటట్లు చేసే క్రీడ రాజకీయం.
ఆరు వారాల ఐపిఎల్ రెండవ సర్కస్ (టోర్నీ) 'భద్రమైనదే' అని, 'ఎందుకంటే స్పాన్సర్లతో దీర్ఘ కాలిక కాంట్రాక్టులు ఇప్పటికే కుదుర్చుకున్నాం' అని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి స్పష్టం చేస్తున్నారు. ఆయన మాటలకు 'మా స్పాన్సర్లు, భాగస్వాములు ఇప్పటికీ మాతోనే ఉన్నారు. ఇతర స్పాన్సర్లు ఇప్పుడున్నవారి కన్నా ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారు' అని మరొక అర్థం తీసుకోవచ్చు. అయితే, పటిష్ఠమైన బిజినెస్ మోడల్స్ (రాజస్థాన్ రాయల్స్, కోలకతా నైట్ రైడర్స్)కు సంబంధించిన ఫ్రాంచైజీలు ప్రస్తుతానికి ఆర్థికపరంగా ఫర్వాలేదనే స్థితిలో ఉన్నారనేది నిజమే. కాని మాంద్యం ముంచేదే కానీ తేల్చేది కాదు కదా.
ఐపిఎల్ రెండవ సీజన్ సమస్యలతో మొదలు కాబోతున్నది. ఫ్రాంచైజీలు బడ్జెట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రకటనకర్తల కోసం బ్రాడ్ కాస్టర్ ఆత్రంగా ఎదురుచూస్తున్నది. కార్పొరేట్ సంస్థల తాయిలాలు తగ్గిపోయాయి. ఐపిఎల్ ను 'ఇండియన్ ప్రాబ్లెమ్స్ లీగ్'గా తిరిగి నామకరణం చేయవలసి వచ్చేటట్లుంది. ఒక్కసారి ఈ దిగువన పేర్కొన్న పరిస్థితిని విశ్లేషించండి. బజాజ్ అలియన్జ్ తో ఒప్పందం కుప్పకూలిన తరువాత టీమ్ స్పాన్సర్ రాజస్థాన్ రాయల్స్ కు ఇంతవరకు దొరకలేదు. ఇక హెచ్ డిఐఎల్ కోలకతా నైట్ రైడర్స్(కెకెఆర్) తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కెకెఆర్ కు నోకియాతో గల రూ. 15 కోట్ల ఒప్పందాన్ని రెన్యూ చేసుకొంటే తక్కువ మొత్తం కోసం సంప్రదింపులు జరపవలసి రావచ్చు. దక్కన్ చార్జర్స్ ను టీమ్ స్పాన్సర్ జెపీ గ్రూప్ గుడ్ బై కొట్టింది. ఎయిర్ సెల్ తో చెన్నై సూపర్ కింగ్స్ కు గల రూ. 13.6 కోట్ల ఒప్పందం కూడా ధరల కోతను ఎదుర్కోవలసి రావచ్చు.
టివి ప్రకటనల స్లాట్ రేట్లు పది సెకన్లకు రూ. 4 లక్షలకు పెంచడంతోను, ఒక్కొక్కరు కనీసం రూ. 20 కోట్ల మేర నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఫ్రాంచైజీలు లాభాలు ఆర్జించే ఉద్దేశంతో స్టేడియాల లోపల ప్రకటనల ధరలను పెంచడంతోను 2008లో చేతికి ఎముక లేనట్లుగా ఖర్చు చేసిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు అదే తీరులో తమ నిధులను వెచ్చించే అవకాశం లేకపోవచ్చు. పైగా టిక్కెట్లపై పది శాతం వినోదపు పన్ను వసూలు చేస్తుండడం వల్ల ఐపిఎల్ మ్యాచ్ ల వీక్షణ ఖరీదైన వ్యవహారం కాగలదు.
రాజకీయ ర్యాలీలు టిక్కెట్లు లేని వ్యవహారాలు. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మార్కెటింగ్ కమిటీ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా వాదన మరొక విధంగా ఉంది. 'ఒక స్పాన్సర్ తప్పుకుంటే మరొక స్పాన్సర్ వస్తారు' అని ఆయన అంటున్నారు. కావచ్చు. షేర్ విలువలు పతనం అవుతున్నప్పుడు, కార్మికులను తొలగిస్తున్నప్పుడు, టివి ప్రకటనల స్లాట్ లపై దండిగా ఖర్చు చేయడం, గ్రాండ్ స్టాండ్ లలో కార్పొరేట్ బాక్స్ లు, బౌండరీ లైన్ పొడవునా హోర్డింగ్ లు వ్యాపారాన్ని అర్థవంతం చేయవు. గణాంకాలు సరైనవి కావు. చివరకు బికినీ కూడా తక్కువే.