ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్
డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సాధించిన విజయాలు, తన అధిష్ఠానంలోని యువత, అనుభవజ్ఞుల సమ్మేళనం వల్ల రానున్న ఎన్నికలలో తనదే పైచేయి కాగలదని కాంగ్రెస్ దృడంగా విశ్వసిస్తున్నది. అంతేకాకుండా వీటితో సైద్ధాంతికంగా అతివాద, మితవాద ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోగలమని కూడా కాంగ్రెస్ విశ్వసిస్తున్నది. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలకు ఆయుధాలు కాగలవనుకున్న సమస్యలను తాము విజయవంతగా పరిష్కరించగలిగినట్లు అధిష్ఠానం భావిస్తుండడమే కాంగ్రెస్ శిబిరంలో ఎన్నికల ముందు ఈ విశ్వాసం, సంతుష్టికి చాలా వరకు కారణం.
'మమ్మల్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలకు ఒక్క అంశం కూడా లేదు. ఉగ్రవాదం, ద్రవ్యోల్బణం, ఆంతరంగిక భద్రత, మతపరమైన ఉద్రిక్తత వంటి అంశాలపై మా పని తీరు అత్యున్నత స్థాయిలో ఉంది' అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎన్నికలు కనుక క్రితం సంవత్సరం వేసవిలో జరిగి ఉన్నట్లయితే పార్టీ ఇరకాటంలో పడి ఉండేదేనని పార్టీ ఆంతరంగికులు అంగీకరించారు. అయితే, గడచిన కొన్ని నెలలలో, ముఖ్యంగా క్రితం సంవత్సరం చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోయిందని వారు భావిస్తున్నారు.
'క్రితం సంవత్సరం ఇదే సమయంలో మాకు అవకాశాలు చాలా దారుణంగా ఉన్నాయి. కాని అణు ఒప్పందంపై ప్రభుత్వం అనుసరించిన నిర్ణయాత్మక వైఖరి, పాకిస్తాన్ పట్ల వ్యవహరణలో కనబరిచిన దృఢచిత్తం వల్ల మా అవకాశాలు మెరుగయ్యాయి' అని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఒకరు వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకోరాదన్న కాంగ్రెస్ నిర్ణయం దాని మిత్ర పక్షాలు కొన్నిటికి ఆగ్రహం తెప్పించినప్పటికీ, అది ఎన్నికల ముందు తాజాగా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను మిత్రపక్షంగా చేసుకున్నది. ఇప్పుడు తన ఎన్నికల వ్యూహం పక్కాగా ఉందని కాంగ్రెస్ భావిస్తున్నది. తన మిత్ర పక్షాలు, ముఖ్యంగా ఆర్ జెడి, డిఎంకె 2004 నాటి ఫలితాలను తిరిగి పొందలేకపోవచ్చునని, అందువల్ల తన సొంత బలాన్ని మెరుగుపరచుకోవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ఆలోచన.
2004 ఎన్నికలలో కాంగ్రెస్ 545 సీట్లలో 375 సీట్లకు పోటీ చేసింది. కాని ఈ దఫా ఆ సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటున్నది. ఆ దిశగా తన మిత్ర పక్షాలతో బేరసారాలను కాంగ్రెస్ ప్రారంభించింది. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ వ్యూహం కొన్ని మిత్ర పక్షాలతో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎన్ సిపి మహారాష్ట్రలో అధిక వాటాతో పాటు జాతీయ స్థాయిలో మిత్ర పక్షాలకు కనీసం 50 సీట్లు కేటాయించాలని కోరుతున్నది. ఇక ఎస్ పి అయితే యుపిలో సీట్లను వదలుకోవడంలో పీనాసితనం చూపుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో కూడా పార్టీ సీట్ల సంఖ్య తగ్గగలదని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తలు గ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ క్రితం సారి 31 సీట్లను గెలుచుకున్నది. ఈ సారి ఈ సంఖ్య 20కి తగ్గిపోవచ్చునని ఆంతరంగిక మదింపు సూచిస్తున్నది. అయితే, పంజాబ్, రాజస్థాన్, కేరళ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో తన సీట్ల సంఖ్యను పెంచుకోవడం ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసుకోవచ్చునని కాంగ్రెస్ ఆశిస్తున్నది. కాంగ్రెస్ క్రితం సారి పంజాబ్ లో 13కు రెండు సీట్లను, రాజస్థాన్ లో 25కు రెండు సీట్లను, ఛత్తీస్ గఢ్ లో 11కు ఒక సీటును గెలుచుకోగా కేరళలో 20కి ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది.