Tuesday, March 3, 2009

మహాకూటమిలో "ఎజెండా" ముసలం!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

మహాకూటమికి ఎజెండా ముసలం పట్టుకుంది. తెలంగాణపై రోజుకోరకంగా మాట్లాడి కయ్యానికి కాలు దువ్వుతున్న వామపక్షాల వైఖరి పట్ల తెరాస అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. వామపక్షాల నేతల వ్యాఖ్యల పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సైతం వినీవిన్నట్టు ఉండటాన్ని కూడా ఆయన సహించలేక పోతున్నారు. దీంతో మహాకూటమి నేతల్లో ఎజెండా విషయంలో మనస్పర్ధలు తలెత్తినట్టు సమాచారం.

మహాకూటమిలో తెలంగాణా అంశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని, కూటమి తరపున ఉమ్మడి ఎజెండా లేదని, ఇలా భిన్న ప్రకటనుల చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. వీటిపై తెరాస నేతలు ఆందోళన చెందుతున్నారు. జనాల్లో వామపక్షాలు సృష్టిస్తున్న గందరగోళానికి కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోవడం తెరాస శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది.

వామపక్షాలకు సీనియర్ నేతలు రాఘవులు, నారాయణలు చేస్తున్న ప్రకటనలపై చంద్రబాబు ఆదిలోనే జోక్యం చేసుకుని ఉంటే ఈ గందరగోళ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదని తెరాస శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఆరంభంలో తమ దారికిరాని సీపీఐను సైతం తమ వైపునకు తిప్పుకున్న సీపీఐలాంటి పార్టీ నేతల నేతల నోటికి చంద్రబాబు తలచుకుంటే తాళం వేయించగలరని తెరాసకు చెందిన పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

దీనికి తోడు చంద్రబాబు మౌనం వహించడంతో వామపక్షాలకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతున్నదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉన్నామని చెపుతున్న వామపక్షాలతో కలిసి ఒకే వేదికను ఎలా పంచుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు.

అందువల్ల తెలంగాణాపై నేతలు చేస్తున్న భిన్న ప్రకటనలను ఇప్పటికైనా ఆపించాలని తెరాస నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వామపక్ష నేతల ప్రకటనలపై తెరాస అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.