Wednesday, July 24, 2013

తెలంగాణ సెగలు : రాజీనామాలకు సీమాంధ్ర మంత్రుల సై!!

కాంగ్రెస్ కోర్ కమిటీకి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు బుధవారం రాత్రి గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీతో పాటు మంత్రి పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే సంకేతాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా మంత్రులకు చేరాయి. దీంతో వారంతా బుధవారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఇందులో మొత్తం 21 సీమాంధ్ర ప్రాంత మంత్రులకుగాను 18 మంది పాల్గొన్నారు. పీసీసీ చీఫ్, రాష్ట్ర రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు మాత్రం హాజరుకాలేదు. మిగిలిన మంత్రులంతా హాజరయ్యారు.

18 మంది మంత్రులు పాల్గొన్న సమావేశంలో అత్యంత కఠినమైన ఏక వాక్య తీర్మానం చేశారు. సమైక్య రాష్ట్రం తప్ప మరేదీ ఆమోదనీయం కాదని తేల్చి చెప్పారు. ఈ భేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ల ద్వారా హైకమాండ్‌కు తమ వాదనలు వినిపిస్తామన్నారు. కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలను సమన్వయ పరుచుకుంటామని తెలిపారు. ఇందులోభాగంగా ఎల్లుండి ఉదయం ఢిల్లీ వెళ్తామని చెప్పారు.

రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ పరంగా జరిగే నష్టాన్ని హైకమాండ్‌కు వివరిస్తామన్నారు. తాము హైకమాండ్ ను నమ్ముతున్నామని, అధిష్టానం కూడా తమను విశ్వసించాలన్నారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధపడాలని, పార్టీని సైతం వదులుకోవాలని తీర్మానించినట్టు చెప్పారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం క్యాంపు ఆఫీసులో వారంతా సమావేశమయ్యారు.