Thursday, July 25, 2013

తెలంగాణపై కదిలిన కాంగ్రెస్... గూర్ఖాలాండ్ కోసం జీజేఎం పరుగు...

తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం చూపేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తోందని ఆ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ఎంపీలు చాలా నమ్మకంగా చెపుతున్నారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ మాటలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి.

తెలంగాణ సమస్య పరిష్కారానికి రాజ్యాంగ సవరణ కూడా చేయాలని దిగ్విజయ్ అనడంతో ఇదేదో ఖచ్చితంగా రాష్ట్ర విభజనకేనన్న అనుమానం మరింత బలంగా కనబడుతోంది. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు... తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చెప్పిన ప్రకారం తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందట. దీంతో ఇప్పుడు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గూర్ఖాలాండ్ ఉద్యమం ఊపందుకుంటోంది.

తెలంగాణపై కేంద్రం అనుకూల నిర్ణయం తీసుకుంటుందంటూ వస్తున్న వార్తల నేపధ్యంలో గూర్ఖా జనముక్తి మోర్చా(జీజెఎం) మరోసారి ఉద్యాన్ని కొనసాగించాలని యోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటే, పనిలోపనిగా గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని కూడా ప్రకటించేయాలని జీజెఎం ప్రధాన కార్యదర్శి గిరి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ త్వరలో లేఖ రాస్తామని చెప్పారు.

తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న నేపధ్యంలో జీజెఎం ఆదివారంనాడు సుమారు 5 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం గిరి విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణపై కేంద్ర నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామనీ, తెలంగాణ ఇస్తే మాక్కూడా గూర్ఖాలండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.