Thursday, March 5, 2009

డిఎస్ కోటపై వైఎస్ కన్ను!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టాలని చాలామంది అనుకుంటారు. అదే మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయితే మూడు పిట్టల మీద గురి పెట్టినట్టు కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఎంపి మధు యాష్కి గౌడ్ ఆ మూడు పిట్టలు. బుధవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల(సంబంధిత)సమావేశంలో వైఎస్ నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పార్టీ అభ్యర్ధిగా అసెంబ్లీ స్పీకర్ సురేశ్ రెడ్డి పేరును ప్రతిపాదించి బాంబు పేల్చారు. 'కేంద్ర మంత్రి జైవాల్ రెడ్డిలా రెడ్డి కులానికి చెందిన, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడ గలిగే, స్పీకర్ అనుభవంతో పార్లమెంటరీ నడవడికను ఆకలింపు చేసుకున్న యువ నాయకుడిని రంగంలోకి దించి జైపాల్ ను తెరమరుగు చేయడం ముఖ్యమంత్రి లక్ష్యం.

ఈ ఎత్తు అటు లోక్ సభకు వెళ్లాలనుకుంటున్న పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఇటు తెలంగాణా కావాలంటూ గొంతు చించుకుంటున్న నిజామాబాద్ ఎంపి మధు యాష్కి ల ఆటకట్టించడానికే' అని కాంగ్రెస్ నాయకుడొకరు వివరించారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనను పిసిసి అధ్యక్షుడు గట్టిగా వ్యతిరేకించడంతో, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వీరప్ప మొయిలీతో రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ గురివారం సమావేశమైనప్పుడు తీవ్ర వాగ్వివాదాలు చెలరేగవచ్చు. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి, దానిని ఎఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడానికి ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర కమిటీ న్యూఢిల్లీలో మార్చి 8న సమావేశమవుతుంది.

ముస్లిం జనాభా గణనీయమైన సంఖ్యలో గల నిజామాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆందువల్ల తాను ఈసారి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయదలచుకున్నట్టు చాలాసార్లు సూచనప్రాయంగా చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్ మేయర్ అయిన తన కుమారుడు ధర్మపురి సంజయ్ కు నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇప్పించి, తాను లోక్ సభకు వెళ్లాలన్నది శ్రీనివాస్ వ్యూహం. నిజామాబాద్ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ స్థానానికి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పేరును కూడా శ్రీనివాస్ ప్రతిపాదించారు. అంతే కాకుండా సిట్టింగ్ ఎంపి మధు యాష్కి గౌడ్ మళ్లీ ఈ స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ, తనకు మార్గం సుగమం చేసుకోడానికి పిసిసి అధ్యక్షుడు పావులు కదుపుతున్నారు.

'నిజామాబాద్ లోక్ సభ టిక్కెట్ ను 2004లో మధుకు ఇప్పించింది పిసిసి అధ్యక్షుడే. అయితే ఇప్పుడాయన(మధు) ముఖ్యమంత్రి అభిమానం కోల్పోయినందున, ఆ సీటు తాను దక్కించుకోవడం సులభమని శ్రీనివాస్ భావించారు. అంతే కాకుండా కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితుడైన యాష్కి ఎక్కడి నుంచైనా సీటు సంపాదించుకోగలరు' అని శ్రీనివాస్ విధేయుడొకరు చెప్పారు. ఇప్పుడు, స్పీకర్ సొంత నియోజకవర్గం బాలకొండ నియోజకవర్గాల పునర్విభజనలో మార్పు చెందకపోయినప్పటికీ, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సురేశ్ రెడ్డి పేరును వైఎస్ ప్రతిపాదించడంతో పిసిసి అధ్యక్షుడి విధేయులు అవాక్కయ్యారు. అయితే తగినన్ని అర్హతలుగల సురేశ్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో జైపాల్ రెడ్డికి సరైన ప్రత్యామ్నాయం కాగలరన్నది ముఖ్యమంత్రి విధేయుల వాదన. గురువారం సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సురేశ్ రెడ్డి, శ్రీనివాసం, మధు యాస్కీల పేర్లు పార్టీ అధిష్టానవర్గం పరిశీలనకు వెళ్తాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.